ఆ పాత మధురాలు

February 26, 2010 in స్వగతాలు by teluguratna

రచన : మీనాక్షి రెడ్డి

పాత అప్పుడప్పుడు కొత్త కంటే అద్భుతంగా ఉంటుంది..గతాన్ని తలుచుకోవడం ,తడుముకోవడం

ఒక అపూర్వానుభూతిని మిగులుస్తుంది……

మధురమైన చినుకుల్లో తడిచి,పులకించడం ఒక కమ్మని అనుభూతి కదా………

…………………………………….

నేను చిన్నగా ఉన్నప్పుడు,స్కూల్ కి సెలవులు వస్తే ఎక్కువగా మా ఊరికి వెళ్ళేవాళ్ళం…

అసలు ఆ ఊరు ,ఆ వాతావరణమే వేరు…….

బస్ దిగగానే తాతయ్య మమ్మల్ని తీసుకెళ్ళడానికి ,వచ్చేవారు…

ఆ పాత మధురాలు by meenakshi Reddy

మా సుబ్బులు తల్లి వచ్చేసిందా ….అంటు దగ్గరికి తీసుకునేవారు.

మా తాత గారు ఎంతో ఇష్టపడినాకు పెట్టిన పేరు..సుబ్బలక్ష్మి…

ముద్దుగా సుబ్బులు అని పిల్చేవారు…మా అన్నయ్య వాళ్ళు ఇప్పటికి

నన్నూ ఈ పేరుతో ఏడిపిస్తుంటారు….సుబ్బూ,సబ్బూ అంటూ…

ఇంటికి వెళ్ళే దారిలో చాలా మంది పలకరించేవాళ్ళు……

ఏమమ్మా..చిన్నదొరసాని బాగున్నావా..?….అని అడిగేవారు…

అలా అన్నప్పుడు భలే అనిపించేది..అదేదో దేశానికి మహారాణిలా ఫీల్ అయ్యేదాన్ని..

నిజంగానే ఊళ్ళో ఉన్న ఆత్మీయతలే వేరు…కదా…

దారి పొడవునా నడిచేప్పుడు,ఆ కళ్ళాపి చల్లిన వాకిల్లు,ముగ్గులు…భలే గా అనిపించేది..

ఇంటికి వెళ్ళగానే అమ్మమ్మ పెరట్లో….పనిలో ఉండేది..

మమ్మల్ని చూడగానే అమ్మమ్మ ముఖంలో మల్లె  పువ్వులాంటి నవ్వు…

ఊరికి వెళ్ళగానే కుప్పిగంతులు,ఆటలు,పాటలు,అల్లరి,అలకలు,ఆగడాలు……

రకరకాల ఆటలు…తొక్కుడు బిల్లా,ఓనగుంతలు.అష్టాచెమ్మ,దొంగా పోలీస్,

ఇంకా………. ఆ ఆటను ఏమంటారో తెలీదు గాని ఇసుకలో ఒక పుల్ల పెట్టి..

అటు,ఇటు అనేసి…ఆ పుల్ల ఎక్కడుందో చెప్పమంటారు….

మరొక ఆట..చేతుల్లో ఇసుక పోసి అందులో ఒక పుల్ల పెట్టి..

మన కళ్ళు మూసేస్తారు..ఎంతెంత దూరం అని మనం అంటే ,ఎల్లిపాయ దూరం అని వాళ్లు అంటారు..

ఈ ఆటను ఏమంటారో నాకు మాత్రం తెలీదు..ఇలా పేర్లు తెలీని ఆటలు బాగానే ఆడేవాళ్ళం.

****                          *****                   *****

మా ఇంటి ముందరే, ఒక పెద్ద బొడ్డుమల్లె చెట్టు ఉండేది…..

నేను ప్రొద్దుట లెగంగానే,ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి..కింద రాలిన మల్లెలన్నీ,ఏరుకుని,నా పరికిణీ లో వేసుకునేదాన్ని

ఎంతసేపు ఏరుకున్న ఇంకా చాలా పూలు ఊండేవి..గాలి వీచినప్పుడల్లా రాలుతుండేవి..

ఈ పూల వాసన ఎంత బాగుంటుందంటే …అసలు చెప్పలేం.

చిన్నప్పుడు అమ్మమ్మ నాకు భలే పరికీణీలు కుట్టించేది.

చిన్న బుంగ చేతుల జాకెట్టు,అద్దాల పరికిణీ,నెమల్ల పరికిణీ,ఇలా బోలేడు…

చిన్నప్పుడు నా కాళ్ళకి ఘల్లు,ఘల్లుమనే గజ్జలుండేవి….

ఈ గజ్జెలంటే, నాకు అస్సలు నచ్చేది కాదు..ఎందుకంటే అన్నయ్యలతో కలిసి

దొంగా పోలీస్ ఆట ఆడినప్పుడు..ఈ గజ్జెల చప్పుడు వల్ల నేను దొరికిపోయేదాన్ని..

అన్నయ్యలతో కలిసి వాగుకి వెళ్లడం,అక్కడ  నీళ్ళలో ఆటలు…నీళ్ళన్నీ ఒకరిపై ఒకరం చల్లుకోవడం..

ఇలా భలేగా ఉండేది..నేనేమో వాగులో శంఖువులు,రంగురంగు రాళ్ళు.. ఏరుకునేదాన్ని….

వాగు ఒడ్డున  వరుసగా..అల్లనేరేడు చెట్లు ఉండేవి.

ఆ చెట్ల కింద రాలిన పల్లు ఏరుకుని తినేవాళ్ళం…అలా మట్టి అంటిన పల్ల రుచే వేరు..

ప్రొద్దుటే లెగంగానే తాతయ్య తో నేను,అన్నయ్య వెళ్ళేవాళ్ళం.పొలానికి..

అసలు,ఆ ఊరు,ఆ పచ్చని పంట చేలు,చెరువు,ఆ మెలికలు తిరగుతూ ప్రవహించె పంటకాలువలు,

గట్ల వెంబడి అక్కడక్కడ..కొబ్బరి చెట్లు….కాలువలో నీల్లతో ఆడుకోవడం…భలే గా ఉండేది.

మా ఇంటి నుండి మా పొలం చాలా దూరం ఉండేది..దారి మధ్యలో..అక్కడక్కడ..

పసుపు రంగులో ఉండె తుమ్మ పూల చెట్లు రమ్మంటూ స్వాగతం పలికేవి..

ఆ పూలంటే నాకు చాలా ఇష్టం… ఒకరకమైన గమ్మత్తు వాసన వస్తాయి ఆ పూలు..

అక్కడక్కడ మధ్య మధ్యలో వేప చెట్ల జోల  పాట…..

కొన్ని చెట్లకు అల్లుకుని..రకరకాల పొదలు….ఉండేవి.ఆ పొదల్లో ఎర్రని రంగు కట్ల పూలు

ఇంకా గుమ్మడి పూలు,ఇంకా నీలం రంగు శంఖు పూలు,చాలా అందంగా ఉండేవి.

ఆ పొదల్లో అక్కడక్కడ ఎర్రగా పండిన దొండ పల్లు…..

దారికి అటు ఇటు మిరప తోటలు,పసుపు పచ్చని పూల శనగ తోటలు,

ఆ మిరప తోటలకి దిష్టి తగలకుండా ఆ మిరప తోటల గట్ల వెంబడి,మధ్య మధ్య లో

ముద్దబంతి చెట్లు పెట్టేవాళ్ళు….అసలు ఆ ముద్దబంతుల అందం గురించి నేనేమని చెప్పను….

ఇంకా తంగేడు,గునుక పూలు..గడ్డి చేమంతులు ఇలా రకరకాల పూల చెట్లు.

ఇంకా అలాగే నడ్చుకుంటూ పోతే మా పొలం వచ్చేది.

తాతయ్య జామ కాయలు కోసిచ్చేవారు….అవి తింటు ఆడుకుని కాసేపయ్యాక

ఇంటికి వెళ్ళేవాళ్ళం…

అన్నట్టు చెప్పడం మరిచా మా పొలానికి దగ్గర్లోనే ఒక చెరువుంటుంది.

వాటిలో తామర పూలు ఉండేవి.చాలా అందంగా..ఉండేవి..

మా పొలం దగ్గర గోరింటాకు చెట్లు చాలా ఉండేవి..

నాకు గోరింటాకు అంటే పిచ్చి కదా మరి..తెంపుకుని ఇంటికి వెళ్ళాక

అమ్మ రోట్లో మెత్తగా నూరి,….రెండు చేతులకి…పెత్తేది…మధ్యలో ఒక పెద్ద చుక్క

వేళ్ళకి సగం వరకు….పెట్టేది…..ఇక ఆ గోరింటాకు ఎర్రగా పండితే ఎంత సంతోషమో….

ఇక పోతే..దసరా పండుగ రోజు ..పట్టు పరికిణీ,బుగ్గ చేతుల జాకెట్టు,వంకీలు,పాపట బిల్ల,గాజులు..

పూలు పెట్టుకుని మూస్తాబయ్యేదాన్ని..ముద్దుగా….

ఇలా దాదాపుగా నేను ఇంటర్ చదివే వరకు వెళ్ళేవాళ్ళం..ఆ తరవాత అంతగా

వెళ్ళక పోయేవాళ్ళం……కాని మొన్నీమధ్య అంటె దాదాపుగా నాలుగు నెల్లు అయింది వెళ్ళి.

కానీ..ఇప్పుడు ఆ ఊరులో చాలా మార్పులు వచ్చాయి….అప్పట్లా లేదు మా ఊరు ఎంతో మారిపోయింది.

మళ్ళీ ఎప్పట్లానే పొలానికి వెళ్ళాను..చెరువు ఎండిపోయింది.

అక్కడక్కడ కొన్ని చెట్లు కొట్టేసారు…కొంత మార్పులు వచ్చేసాయి…

కానీ….

కాలువలోకి దిగగానే కాల్లకింద మెత్తని ఇసుక ..ఆ నీటి స్పర్శ…

ఆ పిల్ల గాలి పలకరింపులో ఏ మార్పు లేదు….

ఆ ఉరు ఎంత మారినా…ఎన్ని మార్పులు వచ్చినా…..

మా ఊరు మా ఊరే..ఎందుకంటే నా వెంట నా జ్ఞాపకాలున్నాయి…

అవి ఏనాటికీ ……మారవు…ఆ బొడ్డుమల్లెల వాసన,ఆ పిల్లగాలుల పలకరింపు,

ఆ కాలువలోని నీల్ల స్పర్శ ఇప్పటికీ నా మదిలో.. పదిలంగా ఉన్నాయి…ఉంటాయి..

…………………………….అవి ఏనాటికి మారవు………………………..